చందమామ కథలు- వంటల రాణి
ఓసారి శ్రీ కృష్ణదేవరాయలు మారువేషంలో నగరంలో తిరుగుతుంటే నాలుగు దారులు కలిసే చోట, ముసలమ్మవెదురుబుట్టలో గారెలు, బూరెలు అమ్ముతూ కనిపించింది. దగ్గరకు వెళ్లగానే వాటి సువాసన ముక్కులకు తగిలి తినాలనే కోరికపుట్టింది. అది మధ్యాహ్నం కావడంతో కడుపులో ఆకలి కూడా కేకలు వేసింది. వెంటనే దగ్గరకు పోయి “అవ్వా ఓ నాలుగు గారెలు ఇవ్వు,” అన్నాడు.
“డెబ్బయ్యేళ్ళ వయసులో కూడా గారెలు అమ్ముకుని జీవిస్తున్నావు. నీకు ఎవరూ లేరా?” అడిగాడు రాయలు మరో నాలుగు పెట్టమని సైగ చేస్తూ. ఆకులో మరో నాలుగు పెడుతూ 'నా భర్తపోయి నాలుగేళ్లవుతుందయ్యా. పిల్లలు కలగలేదు. ఎవర్నయినా తెచ్చి సాదుకుందామంటే, మా ముసలోడు ఒప్పుకోలేదు. నాకు నువ్వు. నీకు నేను పిల్లలము కాదా అనేవాడు. నేను చేసే ఈ రాగి బూరెలు, మినప గారెలంటే మా వోడికి మహా ఇష్టమండీ. ఒకనాడు పండగపూట పరమాన్నం తిని నిద్రలోనే పోయాడయ్యా,” అంది ముసలమ్మకంటనీరు పెట్టుకుంటూ.
మళ్లీ ఆకు చాపగానే మరో నాలుగు పెట్టింది. “ఇంత రుచికరంగా చేయడం ఎవరి దగ్గర నేర్చుకున్నావు?” అడిగాడు రాయలు గారెను నోట్లో పెట్టుకుంటూ. “మా అమ్మనేర్పిందయ్యా. మనిషన్నవాడికి ఏదో ఒక విద్య వచ్చి ఉండాలి. అదే కష్టకాలంలో ఆదుకుంటుందని చెప్పేది. మా వాడకట్టు ఆడవాళ్లంతా ఏ పండగొచ్చినా, నన్ను పిల్చుకుపోయి, పిండి వంటలు చేయించుకుంటారండి. మిగతా రోజుల్లో ఇంట్లోనే చేసి, ఇట్టా వచ్చి, బజారులో అమ్ముకుంటానండి. మా సచ్చినోడు అనేవాడండి. నీ చేతి వంట తినడానికి అదృష్టముండాలి ఆదీ, అని కొసరి కొసరి వడ్డించమనేవాడు మీ మాదిరిగానే,' అంది. బుట్టను ఖాళీ చేసిన రాజు వరహాలు ఇస్తూ, “నిజమే అవ్వా. నీ చేతి వంట తినాలంటే చాలా అదృష్టముండాలి. నాకింక రోజూ ఆ అదృష్టముంటుందనుకుంటున్నా,' అన్నాడు.
మరుసటి రోజు ఓ భటుడు వచ్చి,
“నిన్ను రాజుగారు ఉన్నఫళంగా తీసుకురమ్మంటున్నాడు. పద కచ్చేరికి,' అన్నాడు.
భయపడి పోయింది ఆదెమ్మ “ఎందుకయ్యా? ఎందుకు? నేనేం తప్పు చేశానని?" అంది తత్తరపాటుగా.
“ఏమో, నువ్వు రాజుగారికి గారెలు, బూరెలు ఇచ్చావట గదా నిన్న. అందుకే రమ్మంటున్నాడు.
“అయ్యా, నిన్న వచ్చి తిన్నవారు రాజుగారా? నేను గుర్తుపట్టలేదయ్యా. అయ్యా ఈ తప్పు మన్నించమని చెప్పు. గారెల్లో కాస్త ఉప్పు ఎక్కువైంది. బూరెల్లో తీపి తక్కువైంది. రాజు గారు వచ్చి తింటారని నాకేం తెలుసు. ఏదో దారిన పోయేవాళ్లు కొనుక్కుంటారని ఒకమాదిరిగా చేశాను. ఈ తప్పు కాయమని చెప్పయ్యా," అంది వణీకిపోతూ.
“కోపం మీదేం లేడులే. అయినా దిక్కులేని ముసలమ్మవు. నిన్నేమీ అనడులే.” అన్నాడు భటుడు వెంటబెట్టుకుని తీసుకుపోతూ. వెళ్లేసరికి రాజు సింహాసనం మీద ఉన్నాడు. ఆదెమ్మజదిగి ఒదిగి నిలబడింది. దగ్గరకు రమ్మన్నాడు. ఒణుకుతూ వెళ్లింది. “భయపడకు, నిన్నేమీ అనను,” అని రాజు ధైర్యం చెప్పాడు.
ఆదెమ్మను సభకు చూపిస్తూ, 'ఈమె వయసు డెబ్బయి సంవత్సరాలు.అయినా ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి. ఎందుకంటే ఈమెకు చుట్టకాల్బడం, కల్లు తాగడం వంటి ఏ దురలవాట్లు లేవు. అంతేకాదు. ఈమె చేతిలో ఒక గొప్ప కళ ఉంది. అద్భుతంగా పిండి వంటలు చేయడం వచ్చు. ఎంత బాగా చేస్తుందంటే, నిన్న ఆమె చేసిన గారెలు, బూరెలు మొత్తం నేనే తినేశా. మనిషన్నవాడు ఏదో ఒక విద్యలో ప్రావీణ్యం సంపాదించాలని. వీళ్ల అమ్మ చెప్పిన మాటను పాటించి, వంటలో చాలా చక్కని నైపుణ్యాన్ని సంపాదించింది. ఆ నైపుణ్యమే ఈమెను ఈ సభకు రప్పించేలా చేసింది. ఈవెను చూసి రాజ్యంలోని స్త్రీలందరూ నేర్చుకోవాలి." అని పరిచయం చేశాడు భుజం పట్టుకుని.
ఆదెమ్మకు కండ్ల వెంట జలజలా నీళ్లు కారాయి. నోట మాట రాలేదు. వంగి రాయలవారి పాదాలు అందుకుని “అంతా మీ దయ,” అంది.
“నీ దగ్గర గొప్ప ప్రావీణ్యముంది. కన్న తల్లి చేతి వంట తింటే ఎంత రుచికరంగా అనిపిస్తుందో నీవు చేసిన పదార్థాలు కూడా అలాగే అనిపించాయి. నీ చేతి వంటకు నా మనసు ఉవ్విళ్లూరుతోంది. నిన్ను ఇప్పుడే మా భవనంలో వంట చేయడానికి వంటల రాణిగా నియమిస్తున్నాను. పనిలో పనిగా మా అంతఃపుర స్త్రీలకు కూడా వంట నేర్పు మరి,” అన్నాడు రాయలు.
“నా చేతి వంటను మహారాజు మెచ్చుకుని, రోజూ తింటానంటే నాకు అంతకన్నా అదృష్టమేముందయ్యా, నేను జీవించినంతకాలం మీకు చక్కని వంటలు చేసి పెడతా” అంది భరోసాగా.
0 Comments