చందమామ కథలు-మోసగాళ్లు
ఒక దేశంలో ఇద్దరు మోసగాళ్లు ఉండేవాళ్ళు. ఇద్దరూ సాధువులలాగా వేషాలు వేసుకుని ఊరూరా తిరుగుతూ, భూత వైద్యాలు చేస్తామనీ, తాయెత్తులు కడతామనీ చెప్పి, జనాన్ని మోసగించి డబ్బు సంపాదించి, తమ గుట్టు బయటపడే లోపుగా ఇంకొక గ్రామానికి వెళ్ళిపోతుండేవాళ్లు. పెద్దవాడు గురువునని చెప్పుకునేవాడు. చిన్న వాడు శిష్యుడినని చెప్పుకునేవాడు.
ఈ దొంగసాధువులు ప్రజలను మోసగించేవాళ్లు గనక, వాళ్లు ఇవాళ ఉన్న ఊళ్లో రేపు ఉండకుండా, ఈ నెల ఉన్న దేశంలో వచ్చే నెల ఉండకుండా సంచారం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ వాళ్ల అపఖ్యాతి వాళ్లను తరుముకుంటూ రాసాగింది.
గురుశిష్యులు ఒక ఊరు చేరేసరికి అక్కడ వారి మోసం ఎరిగిన వాడొకడు తటస్థపడ్డాడు. ఆ మనిషి వాళ్లను అటకాయించి, “మీరు దొంగలు! పచ్చి మోసగాళ్లు!” అని కేకలు పెట్టసాగాడు. వెంటనే పదిమంది పోగయారు. వాళ్లకు అనుమానం కలిగింది. ఇద్దరినీ పట్టుకుని మెత్తగా తన్ని ఊరినుంచి సాగనంపారు.
ఇలా జరగగానే గురుశిష్యులిద్దరూ చెరొకదారీ అయిపోయారు. గురువుగారు చాలా రోజులు ప్రయాణం చేసి, ఒక పెద్ద పట్టణం చేరుకున్నాడు. అక్కడ ఒక సత్రం అరుగుమీద చేరి, కళ్లు మూసుకుని కొంతసేపు బకధ్యానం చేశాడు.
ఈలోపుగా పనీ పాటాలేని జనం చాలా మంది చుట్టూ చేరారు. కొంతసేపటికి సాధువు కళ్లు తెరిచి చుట్టూ చేరిన వాళ్ళను చూసి చిరునవ్వు నవ్వాడు.
“స్వామీ. తమరెవరు? ఎక్కడినుండివస్తున్నారు? తమవద్ద ఏమి మహిమలున్నాయి?” అని వాళ్లు అడిగారు.
“మాచేత కానిదేమున్నది? విభూతి మంత్రించి ఇస్తే సమస్త వ్యాధులూ మాయమవుతాయి. తాయెత్తు కడితే గ్రహపీడలు పోతాయి. అన్ని రకాల గాలిచేష్టలు. కుదుర్చుతాము,” అన్నాడు సాధువు, గడ్డం నిమురుకుంటూ.
చుట్టూ చేరిన వారిలో కొంతమంది మంత్రించిన విభూతి తీసుకున్నారు. మరి కొద్దిమంది తాయెత్తులు పుచ్చుకున్నారు. హరిద్వారంలో మఠం కట్టించటానికని చెప్పి సాధువు వారివద్ద కొంత డబ్బు వసూలు చేశాడు. డబ్బు ఇవ్వాలనేసరికి తాయెత్తులు అడుగుదామనుకున్నవారు కొందరు అడగటం మానేశారు.
సరిగ్గా ఆ సమయంలో శిష్యుడు అక్కడికి వచ్చాడు. తన గురువును చూశాడు. వెంటనే వాడు మండిపడుతూ, “మళ్లీ ఇక్కడ దాపురించావా? దొంగ సన్యాసివాడా?” అన్నాడు. తరవాత వాడు చుట్టూ చేరిన జనం కేసి తిరిగ, “అయ్యా, మీరెవరూ ఇతణ్ణి నమ్మకండి! వట్టి మోసగాడు! మొన్న మొన్నటిదాకా నేను ఈ మనిషికి శిష్యుణ్ణిగా ఉండి, ఇతను చేసే పాపంలో పాలుపంచుకున్నాను! నాకు బుద్ది వచ్చింది! ఈ మనిషివల్ల మీరు మాత్రం మోసపోకండి! ఇతడి దగ్గిర ఎలాంటి మహిమలూ లేవు,” అని కేకలు పెట్టాడు.
ఈ మాటలను కొందరు నమ్మిముక్కు మీద వేలు వేసుకుని, “ఎంత మోసం! ఎంత మోసం!” అన్నారు. గురువు వద్ద తాయెత్తులూ, విభూతీ కొనుక్కున్న వాళ్లు మటుకు ఆయన కేసి తిరిగి, “ఎవడో దుర్మార్గుడు వచ్చి తమరిని ఇంతమాట అంటూంటే తమరు చూస్తూ ఊరుకుంటారేం? అనువుతి ఇవ్వండి, మెత్తగా తన్నేస్తాం! అన్నారు.
గురువు గడ్డం నిమురుకుంటూ, “అజ్ఞాని! వాడి పాపం వాడికే తగులుతుంది! వాడిమీద చెయ్యి చేసుకోకండి!” అన్నాడు.
ఈ మాటతో శిష్యుడు మరింత రెచ్చిపోయి గురువుకేసి తిరిగి, 'ఆ మాట అనక ఇంకేమంటావు? నీ బతుకంతా నాకు తెలుసును! ఎవరన్నా నన్ను అంటుకున్నారో, నీ గుట్టంతా బయటపెట్టేస్తాను!”' అని మళ్లీ బిగ్గరగా అరిచాడు.
గురువు మోసగాడే అయి ఉంటాడన్న నమ్మకం అక్కడ చేరినవారికి కలగసాగింది. ఈ లోగా గురువు లేచి నిలబడి, “ఓరీ! నీవు మితిమీరి పోతున్నావు! ఈ అమాయకులునీ మాటలు నమ్ముతారని నీ ఉద్దేశం! కాని నిజం పలికే భగవంతుడున్నాడురా మూర్ఖా! నేను దొంగనే అయితే ఈ కప్పు విరిగి నామీద కూలుగాక. నీ మాటలు అబద్దమే అయితే ఇదుగో అనుభవించు!” అంటూ తన కమండలంలోనుంచి ఇన్ని నీళ్లు తీసి శిష్యుని మీద చల్లాడు.
మరుక్షణం శిష్యుడు మొదలు నరికిన చెట్టులాగా కిందపడి, కొద్దిసేపు గిలగిలా తన్నుకుని, శరీరం కొయ్యబారి శవంలాగా అయిపోయాడు.
“మహిమ కలవాళ్లను నిందిస్తే ఊరికేపోతుందా?” అని కొందరన్నారు. “సామాన్యపు సాధువనుకుని నోటికి వచ్చినదల్లా వాగాడు! రోగం వదిలింది!” అన్నారు ఆ ఊళ్ళోని మరి కొందరు.
“స్వామీ మీ మహిమ తెలియక ఘోరాపరాధం చేసాడు. దయచేసి వాణ్ణి క్షమించండి!” అని కొంత మంది గురువును బతిమాలారు. కాసేపటి తర్వాత గురువు తన జోలెలోనుంచి ఒక తాయెత్తు బయటకు తీసి శిష్యుడి చేతికి కట్టి, “నిన్ను క్షమించాము ఇక లేవరా!” అన్నాడు.
శిష్యుడు అప్పుడే నిద్రలేచినవాడిలాగా కళ్ళు తెరిచి లేచి కూచుని, చుట్టూ కంగారుగా చూసి చివరకు గురువుకేసి చూసి ఒక్కసారిగా ఏడుస్తూ ఆయన కాళ్ల మీద పడి “క్షమించండి, స్వామీ! ఘోరమైన తప్పు చేసాను,” అని వేడుకున్నాడు.
“క్షవించాము పోరా! ఇకపై ఎన్నడూ సాధువుల జోలికి రాకు!” అన్నాడు గురువు.
శిష్యుడు కళ్లు తుడుచుకుంటూ లేచి ఎటో వెళ్లిపోయాడు. తరవాత అక్కడ చేరిన వారందరూ గురువు వద్ద తాయెత్తులు కొని బోలెడంత డబ్బు ఇచ్చారు.
అప్పుడు గురువు ఆ పట్టణం నుంచి బయలుదేరి కొంత దూరాన శిష్యుడిని కలుసుకుని తాను సంపాదించిన డబ్బులో సగం వాడికిచ్చేశాడు.
0 Comments