చందమామ కథలు-గురువుగారి ఆంతర్యం
'వైశాలీ దేశపు రాజు చిత్రగుప్తుడు మంచి పరిపాలనాదక్షుడు.ఆయన తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడేవాడు. కాని చిత్రగుప్తునికి సంతానం కలుగక పోవడంతో క్రమంగా రాజ్య వ్యవహారాల పట్ల ఆయనకు ఆసక్తి తగ్గుతూ వచ్చింది. రాజభక్తుడయిన మంత్రి సునందునికి ఇది ఉచితంగా తోచలేదు. ఎందుకంటే రాజు అలసత్వం చూపితే శత్రువులు బలపడి రాజ్యం అచిరకాలంలోనే చెయ్యి జారిపోతుంది. అందుకే సునందుడు కుల గురువు పరమానందులవారి ఆశ్రమానికి వెళ్లి రాజుగారికి సంతానం కలిగేందుకు ఏదయినా మార్గం సూచించమని వారిని వేడుకున్నాడు.
పరమానందులవారు చిత్రగుప్తుడు పుత్రకామేష్టియాగం చేస్తే తప్పక సంతానం కలుగుతుందని సలహా చెప్పారు. చిత్రగుప్తుడు ఆయన సలహాననుసరించి దేశవిదేశాల నుండి బుత్విక్కులను రప్పించి వారి ఆధ్వర్యంలో పుత్ర కామేష్టి యాగం చేసాడు. రాజు గారికి ఏడాది తిరక్కుండానే కవల పిల్లలు ఉదయించారు. వారికి గురువుగారిచేతనే జయ విజయులని నామకరణం చేయించాడు చిత్రగుప్తుడు.
రాజుగారితో పాటు మంత్రి సునందునికీ పుత్ర జననం అయింది. తన కుమూరునికి సుబుద్ధి అని పేరు పెట్టుకున్నాడు సునందుడు. కొంతకాలం తర్వాత ముగ్గురినీ విద్యాబుద్దులకై పరమానందులవారి ఆశ్రమానికి పంపించారు. సుబుద్ధి వినమంగా విద్యనార్దించేవాడు. జయవిజయులు పోటీపడి ఎంతో ఉత్సాహంతో గురువుగారివద్ద అన్నివిద్యలనూ నేర్చుకున్నారు. శౌర్యపరా'క్రమాల్లోను, ఆలోచనా విధానంలోను జయ విజయులు అంచనాలకు మించే ఉండేవారు తప్ప వెనక్కి తగ్గేవారు కాదు.
వారి విద్యార్దన పూర్తవుతున్న సమయానికి మంత్రి సునందుడు ౮ాత్రికి రాత్రి రహస్యంగా పరమానందులవారిని కలుసుకుని రాజుగారి విన్నపాన్ని వినిపించి వెళ్లిపోయాడు.
పరమానందులవారు మరుసటి దినం ముగ్గురు యువకులను పిలిచి తాను వారికి ఒక పోటీ పరీక్ష పెడుతున్నట్టుగా ప్రకటించారు.
తాను తలపెట్టిన ఒక మహిమాన్వితమైన యాగానికి ప్రారంభంలో ప్రతిష్టించవలసిన మూడు విగ్రహాలను తయారుచెయ్యమని గ్రామానికి పశ్చిమదిశలో నివాసముండే ఒక శిల్పికి ఇంతకు ముందే సూచించానని, అతను తయారుచేసి ఉంచిన విగ్రహాలను ఎటువంటి నష్టం కలగకుండా భద్రంగా తీసుకుని మరుసటిరోజు అపరాహ్న సమయంలోగా ముహూర్తం మించిపోకుండా ఆశ్రమానికి చేరుకోవలసిందిగా ఆదేశించారు.
“ఇంత చదువు చదివి ఇదేం పరీక్ష?” అనుకున్నాడు జయుడు. “గురువుగారి ఆంతర్యం ఆచరిస్తేగానీ అర్ధంకాదు. అనుకున్నాడు విజయుడు. సుబుద్ధి మాత్రం ఆలోచనలో పడ్డాడు.
గురువుగారి ఆదేశాన్ని శిరసావహిస్తూ జయవిజయులు, సుబుద్ధి ఎంతో ఉత్సాహంగా శిల్పి ఉన్న గ్రామానికి బయలుదేరారు.
వారు గ్రావుం చేరేసరికే రాత్రి బాగా పొద్దుపోయింది. ఇంక తప్పనిసరిగా వారు అక్కడ విశ్రమించాల్సివచ్చింది. మరునాడు తెల్లవారుజాముకు కాస్త ముందుగానే ముగ్గురూ బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా హఠాత్తుగా వారిని బందిపోటు దొంగలు చుట్టుముట్టారు. వారినెదుర్కొనకుండా ముందుకు కదలిపోవడం అవమానంగా భావించిన జయుడు వెంటనే కత్తిదూశాడు.
విజయుడు కూడా వారికి సాయం వెళ్లబోతుండగా సుబుద్ధి లక్ష్యాన్ని గుర్తుచేసాడు. “గురువుగారు నిర్దేశించిన శిల్పిని కలుసు కోవాలంటే మనలో కనీసం ఒక్కరయినా ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా వెంటనే బయలు దేరకపోతే లక్ష్యం నెరవేరదు. నేను ఇక్కడే ఉండి జయునికి సాయం చేస్తాను. తమరు ముందుకు సాగిపొండి.” అన్నాడు సుబుద్ధి.
విజయుడు పశ్చిమ దిశ వైపు వేగంగా కదిలాడు. ఇక్కడ జయుడు తన పరాక్రమంతో సుబుద్ధి సహకారంతో దొంగలను తరిమికొట్టాడు. అదంతా కళ్లారా చూసిన గ్రామస్టులు అతని పరాక్రమాన్ని పొగుడుతూ సన్మానించేందుకు సన్నాహాలు చేస్తుంటే జయుని భుజాలు ఆనందంతో పొంగాయి. కాని సుబుద్ధి గురువుగారి ఆదేశాన్ని గుర్తు చేసాడు. జయుడు వాస్తవంలోకి వచ్చి సుబుద్దితో కలసి పయనమయ్యాడు.
ఈలోగా విజయుడు గురువుగారు చెప్పిన శిల్పిని కలుసుకుని మూడు విగ్రహాలను అతి భద్రంగా పట్టుకుని మార్గమధ్యం లోనే సుబుద్ధి, జయులను కలుసుకున్నాడు. ఎవరి విగ్రహాలు వారు అందుకున్నారు. అయితే అప్పటికే గురువుగారు చెప్పిన ముహూర్తపు గడువు దగ్గరయిపోతూండే సరికి ముగ్గురూ వేగం పెంచారు.
వాళ్లు వస్తున్న దారిలో నలుగురు పిల్లలు కూడి ఆనందంగా ఆటాడుకుంటున్నారు. ఇంతలో అనుకోకుండా ఎక్కడి నుంచో బలమైన గుర్రాలను పూన్చిన ఒక రథం వేగంగా రావడం కనిపించింది.అదే వేగంతో వస్తే అక్కడ ఆదమరచి ఆడుకుంటున్న పిల్లలు దాని క్రిందపడి నలిగిపోవడం ఖాయం...
జయుని దృష్టి పోటీలో నెగ్గడంమీదనే ఉంది. ఒకరిద్దరు చిన్నపిల్లల ప్రాణాల కంటె గురువుగారికి సమయానికి విగ్రహం అందజేయడమే ప్రధానంగా భావించి చేతిలోని విగ్రహంతో అతడు వేగంగా ముందుకు కదలిపోయాడు. సుబుద్ధి మాత్రం ఆగలేదు గాని విజయునివైపు సానుకూలంగా చూసి విగ్రహంతో కదలిపోయాడు.
అక్కడ ఆడుకుంటున్నవారిలో ముగ్గురు పెద్దపిల్లలు రథాన్ని చూసి కంగారుపడినా పక్కకి దొర్లి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. ఒక చిన్నపిల్లమాత్రం బెంబేలెత్తి పోయి ఏంచెయ్యాలో తోచక గట్టిగా ఏడుపులంకించుకుంది.
విజయుని ముందు రెండే అవకాశాలు. పాప ప్రాణం.. విగ్రహం భద్రత.
పాపను తప్పించాలంటే విగ్రహాన్ని కిందకి వదిలిపెట్టక తప్పదు. దెబ్బతిన్న విగ్రహం ప్రతిష్టకు పనికిరాదు. గురువుగారి ఆదేశాన్ని ఉల్లంఘించి ఆగ్రహానికి గురి కావలసివుంటుంది. క్షణకాలం కూడా ఆలోచించలేదు విజయుడు. విగ్రహాన్ని అక్కడే జారవిడచి ముందుకు దూకి పాపను రథ చక్రాల క్రింద నలిగిపోకుండా కాపాడగలిగాడు. అయితే విగ్రహం చెయ్యి విరిగి అతని కష్టమంతా కళ్లముందే కరిగిపోయింది. వెనుక నుంచి ఆ పిల్ల తల్లిదండ్రుల దీవెనలు వినిపిస్తున్నా విజయుడు ఆగకుండా కదలిపోయాడు. అప్పటికే జయుడు, సుబుద్ధి గురువుగారికి తాము తెచ్చిన విగ్రహాలను ముహూర్తంలోగా భద్రంగా అందించి గురువు ప్రశంసలు అందుకున్నారు.
విజయుడు మాత్రం విరిగిన విగ్రహంతో పరమానందులవారి ఎదుట తలదించుకుని దోషిలా నిలబడ్డాడు.
ఇంతలో రథం దిగిన మహారాజు చిత్రగుప్తుడు, మంత్రి సునందుడు పరమానందుల వారికి నమస్కరించారు.
పరమానందులవారు అతి ప్రసన్నంగా మహారాజును చూస్తూ “రాజా!నా పరీక్షలో నెగ్గిన విజయుడే రాజ్యాభిషేకానికి అర్హుడు” అన్నారు.
చిత్రగుప్తుడు ఆశ్చర్యంగా ఏదో అనబోతోంటే మంత్రి సునందుడు అందుకున్నాడు. మహారాజా! గురువుల ఆంతర్యం నాకు అర్ధమయింది. గురువుగారి ఆదేశమే వేదమని జయుడు విగ్రహంమీదే దృష్టి నిలిపాడు. కాని పరీక్షలో ఓడిపోతానని తెలిసి కూడా ప్రాణప్రతిష్ట చేయాల్సిన విగ్రహం కంటె మనిషి ప్రాణం ఎక్కువ విలువైనదని భావించాడు విజయుడు, విగ్రహానికి పట్టిన గతి పాపకు పట్టకూడదనే కావాలని ఓడిపోయి గెలిచాడు.”
పరమానందులవారు శాంతంగా అన్నారు. “అవును మహారాజా! ప్రజల ప్రాణ రక్షణే రాజుకి ముఖ్యం. అది నెరవేర్చి విజయుడు రాజ్యపాలనకు అర్హుడయ్యాడు. అలాగని జయుడు తక్కువవాడు కాడు. పరాక్రమవంతుడు. నేను పంపిన బందిపోట్లను చక్కగా ఎదుర్కొన్నాడు. అందుకే అతడు సైన్యాధ్యక్ష పదవికి అర్హుడు. తనపని తాను చేసుకుంటూనే వీళ్లిద్దరికీ ఎవరికి తగిన సలహా వారికిచ్చిన సుబుద్ధి మంత్రి పదవికి అన్నివిధాలా అర్హుడు.” చిత్రగుప్తుడు ఆనందభరితుడయ్యాడు.
అనంతరం విజయుడు పట్టాభిషిక్తుడై వైశాలీ దేశాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు.
0 Comments