చందమామ కథలు-మేకు విలువ
పూర్వం ఒక గ్రామంలో ఒక పేద యువకుడు ఉండేవాడు. అతని పేరు గోవిందుడు. అతనికి పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. కాని భూవసతి కొంచెమైనా లేకపోవడం చేత గోవిందుడు వారిని తన రెక్కల కష్టంమీద పోషించవలసి వచ్చింది. ఇందుకు గాను అతను రహదారిని బస్తీకి నడిచివెళ్లి, ఏదైనా కూలీనాలీ చేసి డబ్బులు సంపాదించి, ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వెచ్చాలు తెచ్చుకుంటూ ఉండేవాడు.
వస్తుతః గోవిందుడు పొదుపు ఎరిగిన వాడు. అతని చిన్నతనంలో అతని తండ్రి “నాయనా! ప్రతి చిన్న వస్తువుతోనూ ఎప్పుడో ఒకప్పుడు అవసరమైన పని ఉంటుంది,” అని చెప్పేవాడు. గోవిందుడు తన తండ్రి చెప్పిన పాఠాన్ని మరిచిపోలేదు.
ఒకనాడు అతను రహదారిన బస్తీకి నడిచిపోతుండగా అటుగా మంత్రికొడుకు గుర్రం ఎక్కి శరవేగంగా వచ్చాడు. గోవిందుడు చూస్తుండగానే గుర్రం కాలి నాడా తాలూకు మేకొకటి జారి, తళుక్కున మెరిసి దారిలోపడిపోయింది.
“బాబూ, నాడా మేకు పడిపోయింది!” అని గోవిందుడు, ఎలుగెత్తి అరిచాడు. మంత్రి కొడుకు వెనక్కు తిరిగి చూసి, నిర్లక్ష్యంగా చెయ్యి ఊపి ముందుకెళ్లాడు. ఒక నాడా మేకు కోసం వెనక్కు వెళ్లడం అతనికి పరువు లోపమనిపించింది. అదీ గాక అతను అరణ్యంలోనుంచి వెళ్ళే అడ్డ దారిన నగరానికి వెళుతున్నాడు. అందుచేత ఆ మేకు లేనందువల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదనుకున్నాడు.
కాని ఈ విషయంలో మంత్రికొడుకు చాలా పొరపడ్డాడు. అతను అరణ్యంలో అట్టే దూరం పోకమునుపే గుర్రం నాడా వదులై ఊడివచ్చింది. గోవిందుడి దగ్గర మేకు తీసుకుని ఉండినట్టయితే మంత్రి కొడుకు ఏదో విధంగా నాడాను మళ్లీ బిగించి ఉండేవాడే. కాని నాడా లేక గుర్రం కుంటుతూ ఉండటం చేత అతను గుర్రం నుంచి దిగి నడవవలిసి వచ్చింది. దొంగలు అతని మీద పడి, నిలువు దోపిడీ చేసి, అతడిని ఒక చెట్టుకు కట్టి పారిపోయారు.
ఈలోగా గోవిందుడు నాడా మేకు తీసుకుని తన వద్ద ఉంచుకుని ముందుకు సాగాడు. అతను కొంత దూరం వెళ్లేసరికల్లా ఒక బండి దారిలో ఒరగబడి ఉండటం కనిపించింది. శాయిమేకు పోవటం చేత ఒక బండి చక్రం ఊడి వచ్చేసింది. బండి పక్కనే ఒక ధనికుడు నిలబడి ఉన్నాడు.
ఆయన గోవిందుడిని చూడగానే, “అబ్బీ నీదగ్గిర ఏదైనా మేకున్నదా? నేను త్వరగా నగరం చేరాలి. దారి మధ్యలో ఎక్కడో శాయి మేకు పడిపోయింది. ఈ దిక్కుమాలిన ప్రదేశంలో కాస్త ఇనపముక్క కూడా ఉన్నట్లు కనబడదు!” అన్నాడు.
గోవిందుడు తన వద్ద ఉన్న నాడా మేకు తీసి దాన్ని చక్రం ఇరుసులోకి రాతితో దిగవేశాడు. చక్రం గట్టిగానే పట్టింది. ధనికుడికి ప్రాణం లేచివచ్చినట్టయింది.
“నువుకూడా నగరానికి పోతున్నావేమో బండిలో రా? అంటూ ధనికుడు గోవిందున్ని తనతో నగరానికి తీసుకుపోయి అతని చేతిలో ఒక బంగారు కాసు పెట్టాడు.
ఆ కాసు చూడగానే గోవిందుడి కళ్లు పెద్దవయ్యాయి. అది తన కుటుంబానికి రెండు మాసాలు సరిపోతుంది. తన తండ్రి ఏనాడో అన్నమాట ఇప్పుడు అక్షరాలా నిజమైంది. ఒక చిన్న నాడా మేకు బంగారు కాసు తెచ్చి పెట్టింది! గోవిందుడు నగరంలో తన కుటుంబానికి నెలరోజులు సరిపడే సరుకులు కొని ఒక గోతంలో వేసుకుని, దగ్గిరదారి గదా అని అరణ్యం గుండా ఇంటికి రాసాగాడు. అతను కొంత దూరం వచ్చేసరికల్త్లా దారికి ఒక పక్కనున్న చెట్ల వెనుకనుంచి ఏవో ఆర్తనాదాలు వినిపించాయి.
గోవిందుడు తన గోతాన్ని గుర్తుగా ఒక చోట పాదల మధ్య దాచి చెట్లలో ప్రవేశించాడు. అతను చాలాసేపు నడిచాక ఒక చోట ఆరుగురు పిల్లలూ ఒక స్రీ కనిపించారు. అందరూ దీనస్టితిలో ఉన్నారు.
ఆ స్త్రీ ఒక కోటీశ్వరుడి భార్య. పిల్లలందరూ ఆమె సంతతి.
“మొన్న సాయంకాలం మేమంతా కలిసి అరణ్యంలో విహారం కోసం వచ్చాం. మా పిల్లలు పూలకోసం అడవిలో జొరబడ్డారు. వాళ్లెక్కడ తప్పిపోతారో అని నేను కూడా వాళ్ల వెంటే వెళ్లాను. ఇంతలో పొద్దుగూకింది. మాకు దారి తెలియలేదు. ఆ రాత్రంతా తిండి లేకుండా దారి వెతుకుతూ తిరిగాం. నిన్నల్లా మాకు దారి దొరకలేదు. అన్నమూ నీళ్లూ లేకపోవడం చేత, మాకు తిరిగే శక్తి కూడా లేకపోయింది. ఇక్కడినుంచే కేకలు పెట్టాం. మామొర ఆలకించిన వాళ్లు లేరు. ఇవాళ నువు దేవుడల్లే వచ్చావు!” అన్నది కోటీశ్వరుడి భార్య.
“మీకు వచ్చిన భయమేమీ లేదు. నేను మీకు దారి చూపిస్తాను. నా వెంట రండి,” అన్నాడు గోవిందుడు.
“నాయనా, మేం అడుగు తీసి అడుగు పెట్టే స్థితిలో లేం. మాకిప్పుడు కావలిసింది పట్టెడన్నం!" అన్నదా స్త్రీ.
“అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను!” అంటూ గోవిందుడు పరిగెత్తి వెళ్లి తన సంచీ తెచ్చాడు. అందులో తన పిల్లలకోసం తెచ్చిన తినుబండారాలు ఉన్నాయి. వాటిని అతను కోటీశ్వరుడి పిల్లలకిచ్చి, తన దగ్గిర ఉన్న పదార్థాలతో ఆ అడవిలోనే వంట చేశాడు. కొద్ది సేపటిలో అందరూ అన్నాలు తిన్నారు. పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్లయింది వారికి. వారిని వెంటబెట్టుకుని గోవిందుడు దారిదాకా తెచ్చి, “ఇక నాకు సెలవిప్పించండి!” అన్నాడు.
“అమ్మయ్యో, మేము ఇల్లు చేరలే! మమ్మల్ని ఇల్లు చేర్చి మరీ వెళ్లు!” అన్నది కోటీశ్వరుడి భార్య. ఆమె తనపిల్లలతోసహా ఇల్లు చేర్చి గోవిందుణ్ణి పంపేస్తూ, అతని చేతిలో ఒక చిన్న సంచీ పెట్టింది.
గోవిందుడు దాన్ని విప్పి చూసుకుంటే అందులో ఎనిమిది బంగారు కాసులున్నాయి. ఒక్క నాడా మేకు ఇంత డబ్బు తెస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతను మరికొన్ని సరుకులు కొనుక్కుని అడవి దారిన బయలుదేరాడు.
అడవి నడిమధ్యకు చేరుకునేసరికి అతనికి సమీపం నుంచి మనిషి మూలుగు వినిపించింది. అతను ఆ మూలుగు వినిపించిన దిక్కుగా వెళ్లి, చెట్టుకు కట్టేసి శోష పడి ఉన్నమంత్రి కొడుకును చూచాడు. మంత్రి కొడుకు హీన స్వరంలో తనకు జరిగిన ప్రమాదం గురించి గోవిందుడికి చెప్పాడు. గోవిందుడు అతని కట్లు విప్పి నడిపించుకుంటూ తన ఇంటికి తీసుకుపోయి కడుపునిండా తిండి పెట్టించాడు.
“బాబూ, తమరు మేకు లేని కారణం చేత ఎంత నష్టపోయారో, నేను దానితో అంత లాభం పొందాను,” అంటూ గోవిందుడు తన కథ యావత్తూ చెప్పాడు.
అంతా విని మంత్రి కొడుకు, “చూడు, గోవిందూ! సరిగా నీవంటి వాడొకడు నన్ను కనిపెట్టి ఉండటానికి నౌకరుగా కావాలి. నావెంట నగరానికి వచ్చెయ్యి. నీకు మంచి ఇల్లు, జీతమూ ఇస్తాను!” అన్నాడు.
ఆ రోజే గోవిందుడు తన కుటుంబాన్ని తీసుకుని నగరానికి వెళ్లి మంత్రికుమారుడి వద్ద కొలువులో ప్రవేశించాడు.
0 Comments