నాలుగో దొంగ
ఒక దేశంలో ముగ్గురు గజదొంగలుండే వారు. వారు రోజుకొక దొంగతనం చేసినా వారిని పట్టడం ఎవరికీ సాధ్యం కాలేదు. వాళ్ల పేరు చెబితే ధనికులకు సింహ స్వప్ప్నంగా ఉండేది. వాళ్లను ఏవిధంగా నైనా పట్టాలనే ఉద్దేశంతో ఆ దేశవు రాజు ప్రతి రాత్రీ తానుకూడా ఒక దొంగలాగా వేషం వేసుకుని తిరగసాగాడు.
ఈవిధంగా కొన్ని రాత్రులు తిరగగా తిరగగా ఒక చీకటి రాత్రి రాజుకు దొంగలుండే స్థలం చిక్కింది. రాజు అక్కడికి చేరుకునేసరికి ఆ దొంగలు ఆ రాత్రి తాము చేయదలిచిన దొంగతనం గురించి ఆలోచిస్తున్నారు. కొత్త దొంగను చూడగానే గజదొంగలకు, కొంత అనుమానం కలిగి, “ఎవరు నీవు? ఇక్కడికి ఏం పని మీద వచ్చావు?” అని అడిగారు.
“నేనూ దొంగనే. ఈ ప్రాంతాల్లో మీరు చాలా గొప్ప దొంగలని విని మీకు నా శక్తి చూపించవచ్చాను,” అన్నాడు రాజు.
దొంగలు నవ్వి, “మా శక్తులను గురించి నీకేమైనా తెలుసా?” అని అడిగారు.
“తెలియదు. చెప్పండి, వింటాను!” అన్నాడు రాజు.
“నేను ఎంతటి లావు తాళాన్నయినా పూచిక పుడకతో తీయగలను,' అన్నాడు మొదటి దొంగ.
“నేను భూమికి చెవిపెట్టి ఆలకించానంటే డబ్బు ఎక్కడ ఉన్నదీ పసికట్టగలను,” అన్నాడు రెండో దొంగ.
“ఒకసారి చూసిన మనిషిని నేను ఏ మారువేషంలో ఉన్నా పోల్చగలను," అన్నాడు మూడో దొంగ.
“నీ శక్తి ఏమిటి?” అని ముగ్గురు దొంగలూ రాజును అడిగారు.
ఏం చెప్పాలో రాజుకు తోచలేదు. అందుచేత ఆయన ఈ విధంగా అన్నాడు.
“నేను బొటనవేలు కిందికి దించానంటే ఎవరినైనా యమలోకానికి పంపగలను. చూపుడు వేలు పైకెత్తానంటే చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్లు బతికి బయటపడతారు,” ఈ మాటలకు ముగ్గురు దొంగలూ సంతోషించారు. తమంత శక్తి సామర్థ్యాలు కలవాడు, తెలివైనవాడూ తోడు వచ్చాడు అనుకున్నారు.
“ఈ రాత్రి ఎక్కడికి దొంగతనానికి పోదాం?” అని అడిగాడు రాజు.
“నీయిష్టం! నువు కోరుకున్న చోటికి పోదాం. మా శక్తిసామర్థ్యాలను నువే చూతువు గాని!” అన్నారు దొంగలు. “అయితే, రాజుగారి ఖజానా కొల్లగొడదాం!” అన్నాడు రాజు.
నలుగురూ కలిసి రాజప్రసాదానికి బయలు దేరారు. పహారావాళ్ల కంటబడకుండా లోపలికి చేరారు. రెండో దొంగనేలకు చెవిపెట్టి ఆలకించి:
“ఖజానా ఈ వైపుగా ఉంది. జాగ్రత్తగా నడవండి!” అని చెప్పాడు. నలుగురూ అటు కేసి వెళ్లారు. ఖజానాకు పెద్దతాళం వేసి ఉంది. కాని దాన్ని మొదటి దొంగ క్షణంలో ఊడదీశాడు. దొంగలు లోపల ప్రవేశించారు. ఈ సమయంలో రాజు వాళ్లకు తెలియకుండా వెళ్లిపోయి తన భటులను పంపాడు. గజదొంగలు ముగ్గురూ సొత్తుతో సహా పట్టుబడ్డారు.
మర్నాడు వారిని విచారణకు దర్చారుకు తీసుకొచ్చారు. సింహాసనం మీద కూర్చున్న రాజును చూస్తూనే మూడో దొంగ తన తోటి వాళ్లతో, “ఈయనే నిన్న మనతో పాటు దొంగతనానికి వచ్చిన కొత్త మనిషి!” అని చెప్పాడు.
విచారణ అయిపోగానే రాజు తన కుడిచేతి బొటన వేలు కిందికి తిప్పాడు. గజదొంగలకు మరణశిక్ష విధించబడింది.
మరునాటి ఉదయం వారి ముగ్గురిని ఉరికంబం దగ్గరకు తీసుకుపోయారు. అధికారి ఒకడు వచ్చి “మీ ఆఖరు కోరిక ఏమిటి?” అని దొంగలను అడిగాడు. “రాజుగారిని ఒక్క ప్రశ్న అడగాలి. అదే మా ఆఖరు కోరిక! అన్నారు దొంగలు.
రాజుగారు వచ్చారు. “మీరు నన్నడగగోరే ప్రశ్న ఏమిటి?" అన్నాడాయన.
“మరేం లేదు మహాప్రభూ! మాశక్తులను మీకు ప్రదర్శించాం. మీ శక్తులను గురించి మాకు రండు విషయాలను చెప్పారు. "రెండోది కూడా చూసి సంతోషించాలని మా కోరిక, అన్నాడు మూడో దొంగ.
రాజు చిరునవ్వు నవ్వి తన చూపుడు వేలు పైకెత్తాడు. వెంటనే రాజభటులు వచ్చి గజదొంగల కట్టు విప్పేసి, ఉరికంబం నుంచి దించేశారు. తరువాత ఆ గజదొంగలు దొంగతనాలు మాని రాజుదగ్గరే కొలువుంటూ, రాజుగారి పట్ల ఎంతో భక్తిగా కాలం గడిపారు.
0 Comments