చందమామ కథలు-బ్రహ్మ ప్రళయం
బ్రహ్మదేవుడు భూమిపై మానవులను సృష్టించి, 'నాయనలారా, తిరిగి నేను ప్రళయం కలిగించేదాకా మీరు ఈ భూమిపై జీవించండి!” అని వరం ఇచ్చాడు.
“దేవా తిరిగి ప్రళయం, ఎప్పుడు వస్తుందో మాకు తెలిసినట్టయితే మేము భూమిపై చేయదగిన కార్యాలను నిర్ణయించుకుంటాము!” అన్నారు మానవులు.
“ప్రళయం ఎంతకాలానికి జరిగేదీ మీకు తెలిసేందుకు నేనొక ఏర్పాటు చేస్తాను, అంటూ బ్రహ్మదేవుడు ఒకచోట మూడు కర్రలు పాతాడు. మొదటి కరకు 64వలయాలు అమర్చాడు. అట్టడుగున ఉన్న వలయం అన్నిటి కన్నా పెద్దది, దానిపైది కొంచెం చిన్నది, దానిపైది ఇంకా కొంచెం చిన్నది, అన్ని వలయాలకూ పైన ఉన్నది అన్నిటికన్న చిన్నది.
తరవాత బ్రహ్మదేవుడు ముగ్గురినీ పిలిచి, “మీరు బ్రహ్మప్రళయం దాకా జీవించే వరం ఇస్తున్నాను. మీ పని ఏమిటంటే ఈ వలయాలన్నిటినీ ఇదే క్రమంలో మూడవ కర్రకు మార్చాలి. పెద్ద వలయం మీద చిన్న వలయం ఉంచవచ్చునే గాని చిన్నదాని మీద పెద్ద వలయం ఉంచరాదు. రెండవ కర్రను తాత్కాలికంగా వలయాలుంచటానికి మాత్రవే ఉపయోగించాలి. మీరు ముగ్గురూ వంతులు వేసుకుని ఈ పని సాగించండి. ఈ అరవై నాలుగు వలయాలూ మూడవ కర్రకు ఇదే క్రమంలో అమర్చిన క్షణాన ప్రళయం వస్తుంది!" అన్నాడు.
మరుక్షణం బ్రహ్మ అంతర్థానమయిపోయాడు. తరువాత బ్రహ్మ నియమించిన వారిలో మొదటి వాడు బ్రహ్మ చెప్పినట్లు చేయసాగాడు. అతను అన్నిటికన్న చిన్న దైనమొదటి వలయాన్ని తీసి రెండవ కరకు తగిలించి, దానికంటే పెద్దదైన రెండో వలయాన్ని మూడో కరకు తగిలించి, దానిపై మొదటి వలయాన్ని పెట్టాడు. తరువాత మూడవదాన్ని రెండో కరకు పెట్టి పని సాగించాడు.
ఇది చూస్తున్నవారిలో ఒకడు, ఈ పని ఎంతో సేపు పట్టదు. మన మానవులకు భూమిపై గల కాలం బహుకొద్ది. ఈ కొద్ది కాలంలో ఏం చెయ్యగలం?” అన్నాడు.
మూడోవాడు మాట్లాడలేదు. ఒక విఘడియ ముగిసే లోపల అయిదారు వలయాలు మూడవ కర్రను చేరాయి. అయినా అతను కంగారుపడలేదు. తాము ముగ్గురూ కలిసి అవిరామంగా పనిచేస్తే వలయాలను రోజుకు ఒక లక్షసార్లు ఇటూ అటూ కదిలించగలమని అంచనా వేశాడు. అలాటి కదలికలు ఎన్ని పూర్తి అయితే బ్రహ్మ ఒప్పజెప్పిన పని ముగుస్తుందో అంచనా కట్టడానికి అతనికి చాలా కాలం పట్టింది.
అప్పటికి ప్రపంచంలో గణితశాస్త్రంలేదు. అందుచేత ఆ వ్యక్తి గణిత శాస్త్రాన్ని స్వయంగా సృష్టించవలసి వచ్చింది. ఆ శాస్త్రం సహాయంతో అతను ఈ వలయాలను 18, 446, 744, 073, 709, 554, 615 సార్గు మార్చితే గాని అవి మొదటి కర్ర ను౦చి మూడవ కర్రకు మారవని నిర్ధారణ చేశాడు.
రోజుకు లక్ష మార్పుల చొప్పున వీటన్నిటినీ పూర్తి చేయడానికి దాదాపు యాభైవేల కోట్ల సంవత్సరాలు పడుతుందని గ్రహించాడు. అతను తన అనుచరులతో, 'సోదరులారా! ఇక ఈ పని మనం మానవచ్చు. ఎందుచేతనంటే ఇంకా యాభైవేల కోట్ల ఏళ్ల దాకా బ్రహ్మ ప్రళయం రాదు. ఈ లోపుగా మానవులం ఎన్ని అద్భుత కార్యాలు సాధించినా సాధించవచ్చు,” అన్నాడు.
0 Comments