పంచతంత్ర కథలు
దమనకం కరటకానికి పామును చంపిన కాకుల కథ చెప్పి, “తెలివిని మించిన శక్తి లేదు. బుద్ది బలం కలిగిన కుందేలు సింహం దురహంకారాన్ని రెచ్చగొట్టి, దానికి చావు తెప్పించింది కాదా? అన్నది. అది ఎలా జరిగింది? అని కరటకం అడిగింది. దమనకం ఈ కథ చెప్పింది:
నీడ తెచ్చిన చావు
ఒకప్పుడు అరణ్యంలో భాసురకం అనే సింహం, సాటిలేని బలం గలది ఉండేది. అది బలదర్పం కొద్దీ నిత్యమూ అనేక లేళ్ళనూ, కుందేళ్ళనూ, ఇతర మృగాలనూ, అకారణంగా చంపుతూ ఉండేది.
ఒకనాడు అడవిలో ఉండే లేళ్ళూ, మేకలూ, ఏనుగులు, కుందేళ్ళూ, ఇతర మృగాలూ ఏకమై సింహం వద్దకు వెళ్ళి, “మహారాజా, తాము తమ కంటబడిన ప్రతి ప్రాణిని చంపటం ఇకమీద మానాలి. తమ కడుపు నిండటానికి రోజుకు ఒక జంతువు చాలును. అలాంటప్పుడు ఇన్ని ప్రాణాలు తీయనేల? మాతో ఒక ఒప్పందానికి రండి. ఈరోజు నుంచి మాలో మేము వంతులు వేసుకుని, ఒక జంతువును తామున్న చోటికి పంపుతాము. తమరు కదిలిరావలసిన పని కూడా ఉండదు. తమరు ఈ ఒప్పందానికి ఒడబడినట్లయితే తమకు కావలసిన ఆహారం శ్రమలేకుండా లభిస్తుంది. రాజు ప్రజల సంపదను ఆవు అను పాలు పొందినట్లుగా పిండి, కొంత లేగల్లకు వదిలి, మంద వృద్ధి అయ్యేటట్టు చూడాలి. అప్పుడే అతను ధర్మపాలన చెయ్యగలడు. ఆవులను పాలు పితకటం మాత్రమే కాదు, వాటికి మేత కూడా వేయాలి. చెట్టుకు ఎరువు వేసి, నీరుపోస్తేగానీ ఫలాల నివ్వదు. ఆఖరుకు అతి చిన్న విత్తు కూడా, పైన పోషణ జరిగితే మహావృక్షంగా తయారై, ఎంతో లాభం కలిగిస్తుంది. ప్రజలైనా అంతే అన్నాయి.
“మీరన్నది నిజం. మీ ఏర్పాటుకు సమ్మతించాను. కానీ ఏ ఒక్క రోజునయినా నా వద్దకు మృగం రాకపోయిందో, నేను మీ అందరి ప్రాణాలూ తీస్తాను అన్నది సింహం. మృగాలు అందుకు సమ్మతించి వెళ్ళిపోయాయి.
ఆ రోజుమొదలు మృగాలన్నీ అరణ్యంలో స్వేచ్చగా తిరగనారంభించాయి. అవివంతులు వేసుకుని, సింహం వద్దకు రోజు కొక జాతి జంతువును మిట్టమధ్యాహ్నం వేళకు పంపుతూ వచ్చాయి.
ఇలా ఉండగా ఒకనాడు కుందేలుకు వంతు వచ్చింది. సింహానికి ఆహారం కావాలంటే కుందేలుకు చాలా విచారం కలిగింది. అది అడుగులో అడుగు వేసుకుని అతి నింపాదిగా నడుస్తూ ఈ సింహాన్ని చంపెయ్యటానికి ఉపాయం లేదా అని ఆలోచించసాగింది.
సింహం భోజనం చేసే వేళదాటి పోయింది. కాని కుందేలు ఇంకా ఆలోచిసూనే ఉన్నది. అది ఇలా అనుకున్నది. "ఈ క్రూరసింహాన్ని ఎలాగైనా చంపాలి. తెలివిగల వాడు సాధించలేనిదీ, దృఢ తీర్మానం గలవాడు జయించలేనిదీ మధురవాక్కు గలవాడికి సిద్ధంచనిదీ ఏదీ ఉండదంటారు..”” ఇలా అనుకుంటూ అది ఒక బావి వద్దకు వచ్చింది. ఆ బావిలోకి తొంగిచూసే సరికి, దాని అడుగున ఉన్న నిటిలో దాని ప్రతిబింబం కనబడింది. అది ఒక్క క్షణం ఆలోచించి, “దిక్కువూలిన సింహాన్ని చంపటానికి అద్భుతమైన ఉపాయం తట్టింది. దానికి వల్లమాలిన రోషం తెప్పించి, ఈ బావిలో పడి చచ్చేటట్టు చేస్తాను. అనుకున్నది.
ఆ తరువాత చాలా ఆలస్యంగా కుందేలు, సింహం వద్దకు వెళ్ళింది. సకాలంలో తిండి అందక, ఆకలితో అలమటిస్తూ సింహం అమితమైన కోపంతో ఉన్నది. అది పెదవులు నాక్కుంటూ, ''రేపు జంతువులనన్నింటినీ చంపేస్తాను అనుకుంటున్నది.
ఇంతలో కుందేలు వచ్చి, సింహానికి ఎదురుగా నిలబడింది.
అసలే పిడికెడు జంతువు, అందులోనూ ఆలస్యంగా వచ్చింది. సింహం దాన్ని చూసి కోపోద్రేకంతో, “ఒక్క పంటికిందికి రావు, ఆలస్యంగా కూడా వస్తావా? ఇప్పుడు నిన్ను చంపి తిని, రెపు మిగిలిన మృగాలన్నింటినీ చంపేస్తాను”' అన్నది.
కుందేలు, సింహం ముందు సాష్టాంగపడి “మహారాజా.. నా వల్లగానీ, ఇతర మృగాలవల్ల గానీ ఏ దోషమూ లేదు. నేను ఆలస్యంగా రావటానికి మీకు చిన్న భోజనం ఉండటానికి అసలు కారణం చెబుతాను వినండి. ఇవాళ తమకు ఆహారం అయ్యే వంతు మా కుందేళ్ళకు వచ్చింది. ఒక్క కుందేలుతో తమకు కడుపు నిండదని, నాతో కలిపి ఐదు కుందేళ్ళను తమ వద్దకు పంపారు. మేము ఐదుగురమూ తమ వద్దకు వస్తుండగా, నేలలో ఉన్న ఒక గుంటలో నుంచి ఒక పెద్దసింహం పైకి వచ్చి, “మీరంతా ఎక్కడికి పోతున్నారు? మీకు ఆయువు తీరిపోయింది గనక ఇష్టదేవతా ప్రార్ధన చేసుకోండి. అన్నది. "మేము ఒప్పందం ప్రకారం మధ్యాహ్ననానికల్లా భాసురకమనే మహా సింహానికి ఆహారం కావాలి అని చెప్పాము.
“అర్ధంలేని మాట! ఈ అరణ్యం నాది. మీరు ఒప్పందాలు నాతో చేసుకోవాలి, ఎవరో భాసురకమనే దొంగతో కాదు. ఆ భాసురకాన్ని ఇలా పిలుచుకు రండి. ఎవరు ఎమిటో మేము తేల్చుకుంటాం. మాలో ఎవరు గెలిస్తే వాళ్ళే మృగాలన్నింటికీ అధిపతి అన్నది.
ఆ ప్రకారమే నేను తమ వద్దకు వచ్చి, సంగతి విన్నవించాను. నా ఆలస్యానికి ఇదే కారణం. నేను తిరిగి రాకపోతానేమోనని, ఆ సింహం మిగిలిన కుందేళ్ళను ఉంచేసుకున్నది. అందుకే నేను తమకు అల్పాహారంగా కనిపిస్తున్నాను" అన్నది.
ఈ మాటలు విని సింహం “మిత్రుడా, అలా అయితే నాకు ఆ ప్రత్యర్థి సింహాన్ని చూపించు. నాకు జంతువుల మీద వచ్చిన కోపాన్నంతా దానిపై వెళ్ళగక్కి, మనశ్శాంతి పొందుతాను. శత్రువును శీఘ్రంగా నిర్మూలించకపోతే, వాడు బలపడి మననే చంపుతాడు. అన్నది.
దానికి కుందేలు “మహారాజా, అతని బలం తెలుసుకోకుండా తమరు అతనితో యుద్ధానికి పోవటం మంచిదికాదు అన్నది.
“ఎందుకి వ్యర్ధప్రలాపాలు? నాకు ఆ సింహాన్ని చూపించు. వాణ్ణి చంపేస్తాను. అన్నది సింహం చిరాకుగా.
కుందేలు సింహాన్ని బావి వద్దకు తీసుకుపోయి, ““ఇదే ఆ సింహం ఉండే కోట” అన్నది. అది బావిలోకి తొంగిచూసి, “తమరు వస్తున్నారని తెలిసి ఆ సింహం అప్పుడే బెదిరిపోయినట్ట్లున్నది ఇలా రండి అన్నది.
మతిమాలిన సింహం బావిలోకి తొంగిచూసి, తన ప్రతిబింబాన్ని మరొక సింహం అనుకుని, ఆగ్రహావేశంతో గర్జించింది. ఆ గర్జన బావిలో రెట్టింపు ధ్వనితో ప్రతిధ్వనించింది. ఆ సింహం తనను సవాలు చేస్తున్నదనుకుని, బుద్దిలేని భాసురకం, ఒళ్ళు తెలియని ఆవేశంతో ఆ లోతైన బావిలోకి దూకేసింది.
కుందేలుకు పరమానందమయింది. పాపిష్టి సింహం పీడ వదిలించినందుకు మిగిలిన జంతువులన్నీ కుందేలును మెచ్చుకుని సుఖంగా జీవించాయి. (ఇంకావుంది)
0 Comments