యుద్ధతంత్రం
కళింగ దేశాన్ని పరిపాలించే చంద్రహాసుడు విహారయాత్రకు రాజధానికి సమీపాన ఉన్న అరణ్యానికి సపరివార సమేతంగా వెళ్ళాడు. అతని వెంట కొద్ది మంది సైనికులు, అస్థానోద్యోగులు కూడా ఉన్నారు. విహార యాత్ర ముగించుకుని చంద్రహాసుడు రాజధానికి తిరుగు ప్రయాణమై వెళ్తుండగా మార్గమధ్యంలో వారికో పెద్ద పులి ఎదురుపడింది. దాన్ని చూసి రాజుతో సహా బృందమంతా స్థాణువులై నిల్చుండిపోయారు. తేరుకున్న మహారాజు ఆ క్రూరమృగాన్ని ఎదిరించడానికి ఇద్దరు సైనికుల్ని నియుక్తృురచవలసిందిగా సేనాధిపతిని ఆదేశించాడు.
అదివిన్న మహామంత్రి పద్మసంభవుడు సేనాధిపతిని కళ్లతో వారించి మహారాజుతో ఏకాంతంగా, 'ఆ మృగాన్ని సైనికులకు బదులు మీరే ఎదిరించడం ఉత్తమం, అని సలహా ఇచ్చాడు. మహామంత్రి సలహా వెనుక ఎదో ఆంతర్యం దాగి ఉంటుందని నమ్మిన మహారాజు అతని సలహా మేరకు పెద్దపులిని ఎదిరించడానికి ఉద్యుక్తుడై ఓ సైనికుని చేతిలోంచి బల్లెం తీసుకున్నాడు. వీరుడైన చంద్రహాసుని ధాటికి ఎక్కువ సమయం నిలువలేక తోకముడిచి అడవిలోకి పారిపోయింది గాయపడ్డ మృగం.
తమని కాపాడేందుకు మహారాజు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రత్యక్షంగా చూసిన రాజపరివారం రాజధానికి చేరుకున్న తర్వాత తమ బంధుమిత్రులందరికీ ఈ విషయాన్ని గొప్పగా చెప్పసాగారు. అలా ఆ నోటా, ఈనోటా ఈ సాహస కృత్యం జనులందరి నోళ్లలోనూ నాని మహారాజు కీర్తి ఇనుమడించింది. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడన్న కీర్తి రాజుకి దక్కింది. కొంతకాలానికి పొరుగునున్న వంగదేశానికి రాజైన శూరసేనుడు కళింగ దేశంపై యుద్దం ప్రకటించాడు. సంధి ప్రయత్నాలన్ని విఫలమై యుద్ధం అనివార్యమైంది.
మొదటి రోజు పోరు భీకరంగా సాగింది.
మహారాజు స్వయంగా యుద్ధంలో పాల్గొని శత్రుసేనల్ని ఛీల్చి చెండాడాడు. మరునాటి యుద్దతంత్రాన్ని రచించాలనుకున్న పద్మ సంభవుడు సేనాధిపతితో ఆ రోజు యుద్ధ విశేషాలు చర్చించసాగాడు. అప్పుడు సేనాని మంత్రితో, 'మహామంత్రీ! ఈ రోజు యుద్ధభూమిలో మహారాజు పరాక్రమాన్ని కనులారా చూడవలసిందే గానీ వర్ణించనలవి కాదు. సామాన్య సైనికుల కంటే కూడా ఉరకలేస్తూ ఆయన ప్రదర్శించిన నైపుణ్యం అమోఘం, మనకు విజయం తథ్యం! అని వ్యాఖ్యానించాడు.
సేనాధిపతి మాటలు విన్న మహామంత్రి సాలోచనగా తలపంకిస్తూ మహారాజుని కలవడానికి అతని ఎకాంత మందిరానికి వెళ్ళాడు. చంద్రహాసుని కలిసి, మహారాజా, యుద్దరంగంలో మన సేనల్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీకెంత ఉందో, ప్రజలను కంటికి రెప్పలా చూసుకునే మీ ప్రాణాలకు ఎట్టి హాని కలగకుండా రక్షించ వలసిన బాధ్యత మన సేనకూ ఉంది. కాబట్టి యుద్ధరంగంలో మీరు అనాలోచితంగా వ్యవహరిస్తూ ముందు ముందుకి విజృంభిస్తూ మీ ప్రాణాలకు ముప్పు కొని తెచ్చుకోక మీ గమనంపై నియంత్రణ కలిగి ఉండాలి, అంటూ సూచించాడు.
ఆ రోజు అడవిలో క్రూరమృగాన్ని ఎదిరించడానికి సైనికులను పంపబోతే వద్దని వారించి, తనని పోరాడమని చెప్పిన మహామంత్రే ఇప్పుడు తను యుద్ధరంగంలో సాధారణ సైనికుల కంటే ముందుంటే నియంత్రణ వారించటం అసహజంగా తోచింది చంద్రహాసునికి. అదే విషయాన్ని ఆయనతో చెప్పి, ఒకే విధమైన రెండు సందర్భాల్లోనూ ప్రతిస్పందించే తీరులో ఈ భేదం ఎంతవరకూ సమంజసం మంత్రి వర్యా? అంటూ సందేహం వెలిబుచ్చాడు.
అందుకు మహామంత్రి పద్మసంభవుడిలా సమాధానం చెప్పాడు. “మహారాజా! సందర్భాలు రెండూ ఒకేలాంటివైనా వాటి మధ్య సూక్ష్మభేదం ఉంది. ఆ రోజు అడవిలో మనకెదురుగా ఉన్నది క్రూర జంతువు. దానికంటూ నియమిత పోరాట రీతులూ, యుద్ధనియమాలూ లేవు. కానీ మన సైనికులు మాత్రం నియమిత రీతుల్లో మాత్రమే సుశిక్షితులు క్రూర జంతువును ఎదుర్కొవాలంటే మీరు పొందిన శిక్షణ, ధరించిన ఆయుధాలుంటే సరిపోదు. దాన్నెదిరించే గుండె ధైర్యం కూడా ఉండాలి. అది ఆ క్షణంలో మన సైనికుల్లో లోపించింది. మీ ఆజ్ఞను ధిక్కరించలేక ఆ మృగాన్ని వాళ్లు ఎదిరించపూనుకున్నా, మీ ప్రాణాల కోసం వారి ప్రాణాలు ఫణంగా పెట్టారన్న అపఖ్యాతి మీకు పర్యవసానంగా దక్కి ఉండేది. అలా కాకుండానే మిమ్మల్నే ఎదిరించమని సూచించాను.
నేను ఊహించినట్లే ఆనాటి మీ సాహసం నేటికీ ప్రజలనోట వీర గాధగా చెప్పబడుతూ మీ కీర్తిని ఇనుమడింపజేస్తోంది. ఇక ఈనాటి యుద్ధం విషయానికొస్తే మన సైనికులు తలపడాల్సింది, తమలాంటివారే అయిన శత్రుసైనికులతో. కాబట్టి ఆనాటి సహజ భయం ఇప్పుడు వీరిలో లేదు. అందునా ఆనాటి సంఘటనల వంటి పలు ఇతర సంఘటనల ప్రభావం వారిపై ఎంతో ఉంది. ఆ ప్రభావం రాజుగా మీపై భక్తి విశ్వాసాలనే కాదు, ప్రభువుగా ప్రేమాభిమానాలను పెంచుకునేలా చేసింది. మీవంటి ప్రభువులను కాపాడుకోవడం కోసం వారు ప్రాణాలను సైతం లెక్కచేయరు. అట్టి సైనికులను మీరు మార్గదర్శిగా ఉంటూ నడిపించాలి. మీ ప్రాణాలెంతో అమూల్యమైనవి కనుక ముందుకు దూకి శత్రువు పన్నిన వలలో మీవంటి వారు చిక్కుకుని ఆపదలు కొని తెచ్చుకోవడం సైన్యానికీ, రాజ్యానికీ శ్రేయస్కరం కాదు. కాబట్టి సాధారణ సైనికులు ముందుండగా వారిని నడిపించడం మీ బాధ్యత. మీ ప్రాణాలకు రక్షణ కవచంలా ఉంటూ ముందుకు సాగడం సైన్యం కర్తవ్యం, అంటూ విడమర్చి చెప్పాడు.
మహామంత్రి సూచనలు, సలహాలు వెనుక ఇంతటి అర్ధమున్నదని తెలుసుకున్న చంద్రహాసుడు, 'మంత్రివర్యా, మా క్షేమాన్ని చూసుకోడానికి మీ వంటి విజ్జులుండటం మా అదృష్టం, అంటూ నమస్కరించాడు.
యుద్ధం ముగిసింది. పద్మసంభవుడి యుద్ధతంత్రాల ముందు శత్రుమూకలు పరాజయం పాలవ్వగా విజయలక్ష్మిచంద్రహాసున్ని వరించింది.
0 Comments