చందమామ కథలు-భూమి పుత్రుడు
దేవరకొండ దుర్గాన్ని పాలిస్తున్స మత్స్యవల్లభుడనే రాజుకు వీపుమీద రాచపుండు ఏర్బడింది. ఆస్థాన వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా, ఎన్ని మందులు ప్రయోగించినా పుండు మానడం లేదు.
ఆ వ్రణం బాధతో మత్స్యవల్లభుడికి మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. ఇక లాభం లేదని రాజు ఇతర రాజ్యాలలో కూడా తనపేరిట దండోరా వేయించాడు.
దేవరకొండ మహారాజు మత్స్యవల్లభుడి వ్రణం నయం చేసిన వైద్యుడికి రాజకుమార్తె స్వాతిని ఇచ్చి పెళ్లి చేయడమే గాక, అర్ధరాజ్యాన్ని కానుకగా ఇచ్చి పట్టాభిషేకం చేస్తారు.
ఈ ప్రకటనతో ఇరుగుపొరుగు దేశాలలోని పేరొందిన ఆస్థాన వైద్యులు ఎందరో దేవరకొండకు వచ్చి మత్స్య వల్లభుడికి వైద్యం చేశారు. రకరకాల మూలికాపసురు వేసి కట్టుకట్టి చూశారు. అయినా ఆ వ్రణం మానడం ఎవరి వల్లా సాధ్యం కాలేదు. చివరకు విజయపురి నుంచి శ్రీముఖుడనే యువకుడు నల్లమల అరణ్యంలో సేకరించిన సంజీవనీ పత్రాల లేపనంతో మత్స్యవల్లభుడి రాచపుండును నయంచేశాడు. మహారాజు పూర్తి ఆరోగ్యవంతుడై స్వస్థత పొందాడు. ప్రకటించిన విధంగా యువరాణి స్వాతిని ఇచ్చి పెళ్తి చేయడానికి, దేవరకొండలో అర్ధరాజ్యానికి రాజుని చేయడానికి సిద్ధపడ్డాడు మత్స్యవల్లభుడు.
కాని అందుకు శ్రీముఖుడు తిరస్కరించాడు. “మహారాజా! నాకు తాతల నుంచి నేర్చుకున్న వైద్యం మీకు రాచకురుపు మానడానికి ఉపయోగపడింది. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. నేను ప్రతిఫలం ఆశించి వైద్యం చేయలేదు. నేను వ్యవసాయం చేసుకుంటూ సంతోషంతో జీవిస్తున్నాను. మీ సత్కారాలు ఏమీ వద్దు, అన్నాడు.
“శీముఖా, నీ ధోరణి నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. సంపద కోసం అందమైన స్త్రీ కోసం ఎందరో రాజులు యుద్దాలు చేస్తారు. తమ సైనికులను గుర్రాలను, ఏనుగులను బలి ఇచ్చి రక్తం ఏరులై పారిస్తారు. అటువంటి అగ్నిపరీక్షలు ఎమీ లేకుండా సునాయాసంగా యువరాణి నీ భార్యగా వస్తుంటే, రాజ్యానికి రాజయ్యే అవకాశం కాళ్ల దగ్గరికి వస్తే తిరస్కరిస్తున్నావు. ఇది లొక విరుద్ధం కాదా? నువ్వు ఎందుకు ఈ అవకాశాన్ని కాదంటున్నావో తెలుసు కోగోరుతున్నాను, అన్నాడు మత్స్యవల్లభుడు.
“మహారాజా! మీరే చెప్పారుగా, రాజ్యం కోసం, అందమైన యువతుల కోసం రాజులు రకాన్ని ఏరులై పారిస్తారని, అటువంటి రాజులతో వియ్యం నాకేల? ఒక వేళ మీరు ఉదార బుద్దితో నాకు అర్థరాజ్యం ఇచ్చినా మీ కుమారుడు, రాజ బంధువులు ఊరుకుంటారా? పైగా నా వంటి సామాన్యుడిని వివాహం చేసుకుని యవరాణి జీవితాంతం సంతృప్తిగా కాపురం చేస్తుందా?
రాచరికం కత్తిమీద సాము. ఎప్పుడు ఇరుగు పొరుగు రాజులు దండెత్తి వస్తారో తెలీదు. బావమరుదులు, మేనమామలతో మంత్రులు అంతఃపురంలో కుట్రలు చేసి వెన్నుపోటు పొడిచి ఎప్పుడు చంపుతారో తెలీదు.
అటువంటి రాచరికపు జీవితం నాకు వద్దు ప్రభూ! నేను భూమిని నమ్ముకున్న భూమి పుత్రుడను. నాకు ప్రశాంతంగా బతకడమే ఇష్టం, అన్నాడు శ్రీముఖుడు.
మత్స్యవల్లభుడు శ్రీముఖుడి అభిప్రాయాన్ని గౌరవించి విలువైన కానుకలిచ్చి విజయపురికి పంపంచాడు.
0 Comments