చందమామ కథలు-తాజెడ్డ కోతి
పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు వద్ద అనేకమంది శిష్యులు శిష్యరికం చేస్తుండేవారు. ఒకనాడు గురువుగారింట్లో చెరుకు అయిపోయింది. అందుచేత శిష్యులంతా ఎండు కట్టెలు ఏరుకురావడానికి అడవికి వెళ్లారు.
ఈ శిష్యులలో ఒకడు వట్టి సోమరి పోతు. వాడు తప్పనిసరి అయితేనేగాని పని చేసేవాడు కాడు. ఒకవేళ పని చేయవలసి వచ్చిన సాధ్యమైనంత తక్కువగానే చేసేవాడు
శిష్యులు చాలామంది ఉన్నారు కనుక ఈ సోమరిపోతు ఎంత పనిచేసినదీ ఎవరికీ తెలిసేది కాదు.
దానికితోడు వాడు తెలివైన వాడు అనుకుని సోమరితనం బయటపడకుండా ఎంతో జాగర్త పడుతుండేవాడు. అడివిలో ప్రవేశించిన శిష్యులంతా ఎండుకట్టల కోసం అంతటా వెతుకుతూ, పనికివచ్చే వంటకట్టెలూ, పుల్లలూ ఎరి ఒకచోట పోగువేస్తూ పనిలో నిమగ్నులయారు. సోమరిపోతుకు ఇదంతా వృధా శ్రమ అనిపించింది. వాడు మిగిలిన వాళ్లకి ఎడంగా వెళ్లాడు. ఎక్కడైనా ఎండిపోయిన చెట్టు కనిపిస్తుందేమోనని వాడి ఆశ. వాడు కొంత దూరం వెళ్లాక వాడికి చెట్టు దొరకనే దొరికింది. ఆ చెట్టున ఒక్క ఆకు కూడా లేదు. చెట్టు బెరడంతా నల్లగా ఉంది. అది ఎండు చెట్టి
అనుకున్నాడు సోమరివోతు.
ఈ ఒక్క చెట్టు విరిచి పట్టుకుపోతే చాలు, ఎంతకాలమైనా పనికివస్తుంది! అనుకుని సోమరిపోతు మంచి నీడ చూసుకుని నిద్రపోయాడు. వాడికి నిద్రపట్టె సమయానికి మిగిలిన శిష్యుల మాటలూ, నవ్వులూ వినిపిస్తూనే ఉన్నాయి. కాని తీరా వాడు నిద్రలేచే సమయానికి చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది. పొద్దు కూడా చాలావరకు వాలిపోయింది. దీంతో సోమరిపోతుకు కంగారెత్తింది. తన తోటి శిష్యులు వంటచెరుకు మోపులు కట్టుకుని వెళ్లి పోయారని వాడు గ్రహించాడు. ఎదురుగా కనబడే మొండిచెట్టు కొమ్మలు గబగబా విరిచి, ఇంత మోపు కట్టి నెత్తిన పెట్టుకుని గురువుగారి ఇల్లు చేరేసరికి అంతకు ముందే మిగిలిన వాళ్లు ఇల్లు చేరటమూ, తమ కట్టెలన్ని ఒక కుప్పగా వెయ్యటమూ కూడా అయింది.
సోమరిపోతు రోజుకుంటూ వచ్చి వాళ్లు వేసిన మోపుల మీద తాను తెచ్చిన కట్టెల మోపు విప్పి పరిచాడు. అంతా సవ్యంగానే జరిగిపోయింది. కదా అని వాడు చాలా సంతోషించాడు.
ఆరాత్రి గురువుగారు తన శిష్యులందరితో, “ఒరే, పలాని గ్రామంలో రేపు సంతర్పణ చేస్తున్నారు. మనకందరికీ పిలుపు వచ్చింది. నాకు వేరే పని ఉంది. కాని మీరంతా తెల్లవారక ముందే ఇంత అన్నం తిని బయలుదేరండి. మధ్యాహ్నానికల్లా సంతర్పణకు అందుకుంటారు!” అని అన్నాడు. శిష్యులంతా సంతోషించారు.
తెల్లవారుజామునే గురువుగారి భార్య శిష్యుల కోసం వంట చేద్దామనుకుని, కిందటి సాయంత్రం వాళ్లు తెచ్చివేసిన కుప్పమీది నుంచి కట్టెలు తీసుకుపోయి, పొయి రాజేసింది. అయితే అవన్నీ పచ్చి కట్టెలు... సోమరిపోతు తెచ్చినవి. అందుచేత ఏ వేళకూ పొయి రాజలేదు. అన్నం ఉడికే సరికి సూర్యోదయం కూడా అయిపోయింది. శిష్యులు సకాలంలో అన్నం తినలేక, ప్రయాణమై సంతర్పణకు వెళ్ల లేకపోయారు. తాజెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్లు ఒక్క సోమరిపోతు మూలంగా, శిష్యులందరికీ సంతర్పణ లేకుండాపోయి ఆశాభంగమయింది.
0 Comments