చందమామ కథలు-యుక్తి బలం
పూర్వం కాశ్మీర దేశాన్ని అవంతివర్మపరిపాలిస్తూ ఉండేటప్పుడు ఏటా కరువులు వచ్చేవి. జనం తిండికి లేక అల్లాడిపోతూ ఉండేవారు.
కాశ్మీర్ ఎత్తయిన కొండల నడుమ ఉన్న దేశం. అక్కడి నదులు కొండల మీద పుట్టి మహావేగంగా దిగువకు ప్రవహిస్తాయి. ఆ కారణంచేత నదులు పొంగడమనేది తరచుగా జరుగుతుండేది.
నిజానికి అక్కడి భూమి చాలా సారవంతమైనది, మహాపద్మసరస్సు కింద అనేక వేల ఎకరాలు చక్కగా సాగు అయి అధిక దిగుబడులతో పంట పండేది.
అయితే అది ప్రజలు అనుభవించే లోపుగా ఆ ప్రాంతంలోని వితస్తానది పొంగటమూ, నది వెల్లువ సరస్సులోనికి ప్రవహించటమూ, సరస్సు పొర్లి పంటలన్నీ నాశనం కావటమూ జరుగుతుండేది.
అవంతివర్మ ఎంతో ధర్మపరుడు. తన వల్ల ఎదో ద్రోహం జరగటం చేతనే తన ప్రజలు ఈ విధంగా కాటకం పాలవుతున్నారనుకున్నాడు.
దేవుళ్లకు ఎన్నో పూజలు చేయించాడు. గ్రహాలకు శాంతులు, యజ్ఞాలూ క్రతువులూ చేయించాడు. ఎన్ని చేసినా వరదలు నిలిచిపోలేదు.
ఇలా కొంత కాలం జరగగా రాజు చెవిన ఒక వార్త పడింది. సుయ్యా అనే వాడొకడు తాను వరదలు పోగొట్టగలనని కనబడ్డ వాళ్లందరి ఎదుటా ప్రగల్భాలు పలుకుతున్నాట్ట. వాళ్ణు జనం పిచ్చివాడికింద జమకట్ట తెగవాదించి ఆనందిస్తున్నారు.
ఏటా వచ్చే కాటకాలను పోగొట్టడానికి ఎదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నందువల్ల అవంతివర్మసుయ్యాను తన వద్దకు పిలిపించాడు. సుయ్యా వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు.
“నీవు కాటకాలను పోగొడతానంటున్నావట, నిజమేనా?' అని అడిగాడు రాజు.
“చిత్తం మహాప్రభూ! వరదలు పోతే కాటకం దానంతట అదే పోతుంది,” అన్నాడు సుయ్యా.
“వరదలు ఎలా పోతాయి? నువు పోగొడతావా? అన్నాడు రాజు.
“చిత్తం, నేను పోగొట్టగలను!' అన్నాడు సుయ్యా.
"మేము చేయలేని పనిని నీవొక్కడవే ఎలా చెయ్యగలవు? అన్నాడు రాజు.
'డబ్బిప్పించండి. ప్రపంచంలో డబ్బు చెయ్యలేని పని ఏముంటుంది? అన్నాడు సుయ్యా.
“మా ఖజానాలో ఉన్న డబ్బంతా పట్టుకుపో. కాని వచ్చియేడు వరదలు రాకుండా చెయ్యి, అన్నాడు రాజు.
సుయ్యా ఖజానా నుంచి తాను మోయగలిగినన్ని బంగారు నాణాలు మూటకట్టుకుని బయలుదేరాడు.
ప్రజలు కూడా అతని వెనకాలే కేకలు పెడుతూ, గేలిచేస్తూ బయలుదేరారు.
రాజుకు టోపీ వేసి సుయ్యా డబ్బు కాజేశాడని కొందరన్నారు. సుయ్యాతో బాటు రాజుకు కూడా పిచ్చిపట్టందని మరికొందరన్నారు. సుయ్యా ఆ ధనం తీసుకుపోయి ఎం చేసాడో చూడాలని అందరికీ బుద్దిపుట్టంది.
ఏటా వరదలు తెచ్చే వితస్తానది కొంత దూరం వెళ్లాక కొండల సందుగా కనుమలో కూడా ప్రవహిస్తుంది. కొన్ని వందల ఏళ్లుగా బ్రహ్మాండమైన బండరాళ్లు రెండువైవులా గల కొండలమీద నుంచి దొర్లివచ్చి నదికి అడ్డంగా వంతెనలాగా పడి ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రజలు ఇక్కడే నదిని దాటుతూ ఉంటారు కూడానూ. ఈ రాళ్ల వంతెన మూలంగానే వరదలు రావటమూ, దాంతో సరస్సు పోర్లటమూ, పంటలు నాశనం కావటమూ జరుగుతూండేది.
సుయ్యా డబ్బు మూట మోసుకుని ఈ ప్రాంతానికే చేరుకున్నాడు. వాడివెనకనే వేలమంది మనుషులు కూడా వచ్చారు. సుయ్యా నదికడ్డంగా ఉన్న రాళ్ళ మీదికి పోయి, తను తెచ్చిన మూటలో నుంచి బంగారు నాణాలు తీసి రాళ్లమధ్య గుప్పి కళ్లతో పడేస్తూ అవతలి ఒడ్డుకు పోసాగాడు.
జనంలో హాహాకారాలు బయలుదేరాయి. సుయ్యా నిజంగా పిచ్చివాడేనని రుజువయింది. లేకపోతే బంగారం ఆ విధంగా నదిలో పారబొస్తాడా? వాణ్ణీ ఆపటానికి కూడా ఎవరికీ శక్యం కాలేదు.
జన౦లోని కొందరికి అకస్మాత్తుగా చైతన్యం కలిగింది. కొందరు గబగబా నీటిలోకి దిగి బంగారం కోసం వెతకసాగారు. మరికొందరు ముఠాలుగా చేరి పెద్ద పెద్ద బండరాళ్ళను ఒడ్డుకు తోసి వాటికింది ఉన్న బంగారు నాణాలు ఏరుకోసాగారు.
కొద్దికాలానికే ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. లక్షలాది జనం వచ్చి, అనేకవందల ఏళ్లుగా నదికి అడ్డంగా పడి వున్న రాళ్లను ఒడ్డుకు పట్టించసాగారు. వాళ్ల ప్రయత్నాలను ప్రోత్సహంచడానికి సుయ్యా ఖజానా నుంచి ఇంకా, ఇంకా బంగారు నాణాలు తెచ్చి కదిలించని రాళ్ళ సందుల్లో పడెయ్యసాగాడు.
సాయంకాలం లోపుగా రాళ్లవంతెన దాదాపు నిర్మూలమైపోయింది. కష్టపడి పనిచేసిన ప్రజలందరికీ బంగారు నాణాలు దొరికాయి. అది మొదలు కాశ్మీర ప్రజలు వరదలూ, కాటకాలూ లేకుండా సుఖంగా జీవించారు.
సుయ్యా యుక్తికీ, అతడు దేశానికి చేసిన మేలుకూ మెచ్చుకుని అవంతివర్మ అతనికి చాలా ధనమిచ్చి సత్కరించాడు.
0 Comments