బామ్మగారు-బాబిగాడు
బాబి అయిదోతరగతి చదువుతున్నాడు. తల్లితండ్రులు లేరు. అన్ని పనులకు బామ్మ మీద ఆధారపడటం బాబిగాడికి అలవాటు. నిద్రలేచాక పక్కబట్టలు దులుపుకోలేడు. పళ్లను తోముకోలేడు. స్నానం చేసుకోలేడు. అన్నం స్వయంగా తినలేడు. బామ్మతోడు లేకుండా బడికి వెళ్లి రాలేడు.
తోటిపిల్లలతో ఆటలాడటానికి భయం. పాటలు పాడటానికి భయం. టీచర్లిచ్చిన ఇంటిపని స్వయంగా చేసుకోలేడు. వాడి మందబుద్ధి గురించి ఉపాధ్యాయులు అప్పుడప్పుడూ బామ్మతో ఫిర్యాదు చేసేవారు.
మనవడి మందబుద్ది అలా ఉండిపోతుందేమోనని బామ్మభయం. “స్వయంగా నీ పనులు నువు చేసుకోడం నేర్చుకో,” అని చెప్పి చెప్పి విసిగిపోయింది. తనేమయినా అయిపోతే మనవడి గతేమిటని దిగులు పడుతుండేది. మనవడికి పక్షులను జంతువులను చూపించి వాటి పిల్లలు ఎలా ఇతరులపై ఆధారపడకుండా బతుకుతున్నాయో అర్ధమయేలా వివరించేది.
బాబిగాడికి అవేవీ చెవిన పడేవి కావు. సతాయించి బామ్మచెబితే, “అబ్బ ఆ సొదంతా చెప్పకు. నీవు తోడు ఉన్నావుగా నాకేమిటి భయం?” అని చిరాకు పడుతుండేవాడు. బామ్మ తన ప్రయత్నం తాను మానలేదు. ఆ సంవత్సరం బాబిగాడు చదివే పాఠశాలలో ఐదవ తరగతి పిల్లలతో అరకులోయకు రెండు రోజుల విహారయాత్ర వేశారు. మినీ బస్సులో ప్రయాణం. అందరితో పాటు బాబి గాడు కూడా బయలుదేరాడు.
బస్సు ఘాట్‌రోడ్‌లో మలుపులు తిరిగినప్పుడల్లా పిల్లలు ఒకరి మీద ఒకరు పడి కేరింతలు పెట్టసాగారు. బస్సు కొండల మీద నుంచి పోతున్నప్పడు లోయల దృశ్యాలు చూసి పిల్లలు సంబరపడుతూ టీచర్లు ఉన్నారన్న ధ్యాస కూడా మరిచిపోయారు. కేకలు, చప్పట్లు. ఒకటే సందడి!
బాబిగాడికి ఇవేమీ పట్టలేదు. ఒక్కడే బిక్కుబిక్కుమని సీటుకు అతుక్కుపోయినట్లు కూర్చున్నాడు. అది చూసి పిల్లలు, “మీ బామ్మ గుర్తుకొచ్చిందా! ఆమెను తీసుకురావలిసింది. అయ్యో పాపం. బామ్మ లేకుండా బాబిగాడు ఉండగలడా? అంటూ గేలి చేయసాగారు. బాబిగాడిలో ఉక్రోషం పెరిగింది. ముఖం ఎర్రబడింది.
బస్సు అరకు లోయ చేరింది. పిల్లలందరూ బిలబిల బస్సు దిగారు. అందరకి ఆకలి దంచుతోంది. టీచర్లు చూపించిన కేంటీన్ లోకి పిల్లలు చొరబడ్డారు. ఒకరిపై ఒకరు పరిహాసాలాడుకుంటూ పిల్లలు వేడి వేడి ఫలహారాలు తినసాగారు. ఒక్క బాబిగాడు మాత్రం ఫలహారం ముందు పెట్టుకుని కూర్చున్నాడు.
ఇడ్లీ తినబోతే చట్నీ జారి చొక్కాపై పడింది. నీరు తాగబోతే గ్లాసు పక్కనున్నవారి మీదకు మళ్ళింది. అందరూ నవ్వారు. “పాపం బాబిగాడు. ఏ పనీ చేసుకోలేడు,” అని గేలి చేశారు. బాబిగాడిలో రోషం తొంగి చూసింది. ఎలాగోలా ఫలహారమయిందనిపించుకున్నాడు.
టీచర్లు పిల్లలనందరినీ క్యూలో నిలబెట్టించారు. దగ్గరలో ఉన్న పద్మావతి ఉద్యానవనంకి అందరు బయలుదేరారు. తోటలో రకరకాల మొక్కలు, పూలు క్రోటన్లు, జంతువులు పక్షుల ఆకారాల్లో పొదలు ఉన్నాయి. పిల్లలు వాటిని చూశారు. గిరిజనుల చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అనేక చిహ్నాలను వారు అక్కడ చూసి ఆనందించారు.
మధ్యాహ్నం రెండయింది. అందరూ భోజనానికి ఊర్లోకి వచ్చారు. బాబిగాడికి మళ్ళీ సమస్య వచ్చిపడింది. ఏది ఎలా కలుపుకోవాలో ముందు ఏది తినాలో బాబిగాడికి అర్ధం కాలేదు.
బాబిగాడి అవస్థను చూసిన పిల్లలు, “ఇప్పుడు మీ బామ్మ వచ్చి తినిపించదులే, అన్నీ కలుపుకుని ఈ రోజుకు తిను,” అని సలహాలివ్వడం ప్రారంభించారు. బాబిగాడు ఎలాగోలా భోజనం ముగించాడు. చేతులు శుభ్రం చేసుకున్నప్పుడు చొక్కా పూర్తిగా తడుపుకోవడం బాబిగాడికి చాలా అవమానమనిపించింది. సాయంత్రం వరకు పిల్లలతో గడిపి అందరితో పాటు లాడ్జి చేరుకున్నాడు.
లాడ్జీలో బస. పిల్లలందరకూ ఆ అనుభవం కొత్త! అసలే చలికాలం. అందులోనూ అరకులోయ చలి. పులిలా మీద పడి పలుకరించింది. కాళ్లను డొక్కల్లో ముడుచుకుని తెచ్చుకున్న దుప్పట్లు కప్పుకుని అందరూ నిద్రపోయారు.
తెల్లవారింది. బాబిగాడికి మళ్లీ కష్టాలు ఆరంభమయ్యాయి. పళ్లు తోముకోవడానికి బ్రష్ పట్టుకోగానే బామ్మ గుర్తుకొచ్చింది. రోజూ బామ్మేదగ్గరుండి పళ్లు తోమేది. తోటి పిల్లలు చకచక బ్రష్ చేసుకుంటూ తనను గమనించడం చూశాడు. మొత్తంమీద బ్రష్ చేసుకోవడం పూర్తి చేశాడు. అందరిలాగే కొళాయి వద్దస్నానం చేశాడు. ఉదయం ఫలహారం చేసేటప్పుడు చొక్కా మీద చట్నీ వేసుకోకుండానే జాగ్రత్తపడ్డాడు.
ఫలహారం తీసుకున్నప్పుడు తోటిపిల్లలు గమనించకపోవడం బాబిగాడికి మంచిదే అయింది. తడబాటు తగ్గింది. అంతలో పిక్నిక్ బస్సు హోటలు ముందుకొచ్చి ఆగింది. దగ్గరలో ఉన్న జలపాతం చూడటానికి అందరూ బస్సెక్కారు. కొంతసేపటికి బస్సు జలపాతం వద్దకు చేరుకుంది. ఏటవాలుగా ఊన్న ఒక చాపరాయి మీద నుండి గోస్టనీ నదినీరు ఒక లోయలోకి వరదలా జారిపడుతుంది. నీరు పడుతున్నప్పుడు వచ్చిన హోరుమన్నశబ్దం ఒక రకమైన భయాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. తుంపర్లతో కూడిన చల్లనిగాలి శరీరాలను తాకుతూ పిల్లలను ఆనంద పరవశులను చేసింది. బాబిగాడు మరీ ఆనందం పొందాడు. అంతవరకు ఇల్లు కదలని అతడికి, ఆ విహారయాత్ర ప్రయాణం అతడి మనస్సును హత్తుకుంది. అక్కడ విశ్రాంతి పొందాక తిరుగు ప్రయాణమయ్యారు. తిరుగు ప్రయాణంలో కొండల మీద కోతుల గుంపులు చూస్తూ పిల్లలు భలే సరదా పొందారు. దారిలో బొర్రా గుహలు చూశారు. విశాలమైన ఆ గుహలో చిట్టిచీమల్లా పిల్లలు బారులు తీరి తిరిగారు. గుహల సౌందర్యాన్ని చూశాక అందరు మళ్లీ బస్సెక్కి పొద్దుకుంకకముందే ఊరు చేరారు. ఎవరిళ్లకు వారు చేరుకున్నారు.
మనవడు ఇల్లు చేరేసరికి అవ్వ ఆప్యాయంగా మనవడిని అక్కున చేర్చుకుని, “ఎలా అయింది ప్రయాణం? ఎంతమంది వచ్చారు? విశేషాలు ఏమిటి? విహారయాత్ర నీకు నచ్చిందా! బాగా ఆనందించావా,” అంటూ ఏవోవో ప్రశ్నలు వేసింది బామ్మ “అవన్నీ వివరంగా చెబుతాను బామ్మా, ముందు నాకు భోజనం పెట్టు. ఆకలిగా ఉంది.” అన్నాడు బాబిగాడు. అవ్వ గబగబ భోజనం వడ్డించింది. అన్నం కూర కలిపి బామ్మ తనకు తినిపించబోతుంటే బాబిగాడు ఆపాడు. తనే స్వయంగా తిన్నాడు. బామ్మ సాయం లేకుండానే ఎంగిలి చేయి కడుక్కున్నాడు. బామ్మ నివ్వెరపోయింది. యాత్ర విశేషాలు చెబుతూ బాబిగాడు పక్క బట్టలు సర్దుకున్నాడు. మనవడు స్వయంగా చేసుకుంటున్న పనులు చూసి బామ్మకు నోట మాట రాలేదు. అలిసిపోయి నిద్రపోయిన బాబిగాడి పక్కన బామ్మచోటు చేసుకుని పడుకుంది.
తెల్లవారింది. బాబిగాడు స్వయంగా బ్రష్ చేసుకున్నాడు. బామ్మ స్నానం చేయించబోతుంటే “వద్దు బామ్మా నేనే స్నానం చేసుకుంటాను,” అని అన్నాడు. తరువాత భోజనం చేసి చకచక బడికి పోయాడు. బామ్మ నిశ్చేష్రురాలయింది. బడి వదిలే సమయానికి బాబిగాడిని తీసుకురావడానికి బామ్మ ఎదురుగా వెళ్తే బాబిగాడు బామ్మను చూసి 'పద పద, నేనొక్కడినే ఇంటికి వచ్చేయగలను. నేనింకా చిన్నపిల్లాడినేమీ కాను!” అంటూ బామ్మ కన్నా ముందుగానే ఇల్లు చేరుకున్నాడు. సాయంత్రం హోమ్‌వర్క్ కూడా తనే చేసుకున్నాడు. బామ్మసాయం తీసుకోలేదు. ఆ రాత్రి బామ్మ “అన్నం తినిపిస్తాను. రా నాయనా,” అని పిలిస్తే “నీవు తినిపించనక్కరలేదు అన్నం వడ్డించి పెట్టు చాలు,” అని తిరిగి సమాధానమిచ్చాడు.
బాబిలో ఇంత త్వరగా మార్పు వస్తుందని ఊహించలేదు బామ్మ,
వారం రోజుల తర్వాత ఒక ఉపాధ్యాయురాలు బామ్మకు కనిపించి, “మీ బాబిగాడు బాగా మారాడు. అరకు విహారయాత్ర మీ మనవడిలో మార్పు బాగా తెచ్చింది. మీ మనవడి గురించి మీరిక దిగులు పడనక్కరలేదు. బయట ప్రపంచం, తోటి పిల్లలను గమనించి ఎంతో నేర్చుకున్నాడు. మనమునుకుంటున్నట్లు బాబిగాడు మందుడు కాడు బద్దకస్తుడు అంతే. ఆ బద్దకం విహారయాత్రలో వదిలింది!” అన్నారు.
బామ్మ దిగులు పటాపంచలయింది. స్వయంగా పనులు చేసుకుపోతున్న మనవడిని చూసి ఆమె మురిసిపోయింది.
0 Comments